భారత అంతరిక్ష రంగంలో కీలక ముందడుగుగా, హైదరాబాద్ స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ రూపొందించిన దేశపు తొలి ప్రైవేట్ ఆర్బిటాల్ రాకెట్ స్కైరూట్ ‘విక్రమ్-1’ ప్రయోగం నేడు ఉదయం 11:30 గంటలకు శ్రీహరికోట నుంచి ప్రయోగం కానుంది. ‘ఆగమన్’ పేరుతో జరుగుతున్న ఈ మిషన్‌లో, 20-24 మీటర్ల ఎత్తు గల ఈ నాలుగు దశల రాకెట్ పూర్తిగా కార్బన్ కాంపోజిట్‌తో తయారైంది. 350 కిలోల వరకు బరువున్న చిన్న ఉపగ్రహాలను తక్కువ ఎత్తు కక్ష్యలోకి పంపేలా దీన్ని రూపొందించగా, తొలి ప్రయోగంలో 450 కిలోమీటర్ల ఎత్తులోని కక్ష్యను లక్ష్యంగా చేసుకున్నారు. 3డీ-ప్రింటెడ్ ఇంజిన్లు వంటి స్వదేశీ సాంకేతికతలతో పాటు, గ్రహా స్పేస్, కాస్మోసర్వ్ స్పేస్‌లకు చెందిన పరికరాలను, శాస్త్రవేత్తల సూక్ష్మ శిల్పాలను, ప్రధాని మోదీ సందేశాన్ని కూడా ఈ రాకెట్ మోసుకెళ్తోంది.
ఈ ప్రయోగం పూర్తిస్థాయి వాణిజ్యపరమైనది కాదని, రాకెట్ ఇంజిన్ సామర్థ్యం, స్టేజ్ సెపరేషన్ వంటి కీలక అంశాలపై డేటా సేకరణే ప్రధాన లక్ష్యమని స్కైరూట్ తెలిపింది. ఇది విజయవంతమైతే చిన్న ఉపగ్రహాల ప్రయోగ మార్కెట్‌లో భారత్ స్థానం మరింత బలపడుతుందని, భారత ప్రైవేట్ అంతరిక్ష పరిశ్రమకు ఇదో చారిత్రక మలుపు అవుతుందని స్కైరూట్ సీఈఓ పవన్ కుమార్ చందన అభిప్రాయపడ్డారు.
