కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయం పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విమానాశ్రయం ఆవరణలోనే ఉన్న 136 ఏళ్ల చరిత్ర కలిగిన గౌరీపూర్ జామా మసీదును మరో ప్రాంతానికి తరలించాలన్న ప్రతిపాదన రాజకీయ, సామాజిక వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. భద్రతా దృష్ట్యా సాధారణ భక్తుల ప్రవేశాన్ని అధికారులు నియంత్రించడంతో, దీన్ని వ్యతిరేకిస్తూ మసీదు కమిటీ, జమియా ఉలేమా-ఏ-హింద్ సంయుక్తంగా శుక్రవారం తలపెట్టిన భారీ నిరసనను పోలీసులు అడ్డుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా విమానాశ్రయం చుట్టుపక్కల భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
గేట్ నంబర్ 7, బాంక్రా క్రాసింగ్ వంటి కీలక ప్రాంతాల్లో నలుగురు కంటే ఎక్కువ మంది ఒకచోట చేరకుండా బీఎన్ఎస్ఎస్ చట్టంలోని సెక్షన్ 163 కింద నిషేధాజ్ఞలు అమలు చేశారు. మాజీ మంత్రి సిద్ధిఖుల్లా చౌదరి నాయకత్వంలో నల్ల బ్యాడ్జీలు ధరించి పెద్ద ఎత్తున శుక్రవారం నమాజ్ నిర్వహించేందుకు భక్తులు యత్నించగా, పోలీసులు బలగాలను, వాటర్ కానన్లను మోహరించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసు ఉన్నతాధికారులతో చర్చించిన అనంతరం సిద్ధిఖుల్లా చౌదరి తాత్కాలికంగా నిరసనను విరమించుకుంటున్నట్లు తెలిపి, ప్రార్థనలను వేరే ప్రాంతంలో నిర్వహించారు.
ఈ వివాదానికి మూలంలో దశాబ్దాలుగా నెలకొన్న విమానయాన భద్రతా అంశాలు ఉన్నాయి. రన్‌వేకు కేవలం 165 మీటర్ల దూరంలో, అత్యంత సున్నితమైన లెవెల్-3 భద్రతా జోన్ పరిధిలోనే ఈ మసీదు ఉంది. ఇప్పటివరకూ గుర్తింపు కార్డుల ఆధారంగానే స్థానికులు లోపలికి వెళ్లేవారు. వందలాది మందిని ఇలా విమానాశ్రయం లోపలికి అనుమతించడం జాతీయ భద్రతకు ప్రమాదకరమని కేంద్ర నిఘా సంస్థలు పేర్కొన్నాయి. అదనంగా, రెండో రన్‌వే విస్తరణకు ఈ కట్టడం ఆటంకంగా మారడంతో దాన్ని తరలించే దిశగా అధికారులు ప్రయత్నాలు మొదలుపెట్టారు.
“మత స్వేచ్ఛ వేరు, దేశ భద్రత వేరు” – సీఎం స్పష్టీకరణ
ఈ అంశంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి స్పందించారు. ప్రభుత్వం ఎవరి మతపరమైన హక్కులనూ కాలరాయడం లేదని, అయితే దేశ భద్రత, విమానాశ్రయ భద్రతకే తమ ప్రాధాన్యమని స్పష్టం చేశారు. చైనా, బంగ్లాదేశ్ సరిహద్దులకు సమీపంలో ఉన్న ఈ అంతర్జాతీయ విమానాశ్రయం గేట్లను ఇలా అందరికీ తెరిచి ఉంచడం సాధ్యం కాదని, చట్టపరమైన ప్రక్రియను అనుసరించే మసీదు తరలింపుపై నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు.
